
సిఎం కేసీఆర్ శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బహిరంగసభ నిర్వహించారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు:
నగరంలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ఐటి నిపుణులు అందరూ అభ్యర్ధుల మంచీచెడులను బేరీజు వేసుకొని ఓట్లు వేయాలని కోరుతున్నాను.
నగరంలో ప్రశాంత వాతావరణం భగ్నం చేసేందుకు ఇతరులకు అవకాశం ఇవ్వొద్దు. దాని వలన పరిశ్రమలు, పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతే మనమే నష్టపోతామని అందరూ గుర్తుంచుకోవాలి.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో నగరం ఎలా ఉంది?ఇప్పుడు ఎలా ఉందో మీరే చూస్తున్నారు. అలాగే విద్యుత్, నీటి సమస్యలు పరిష్కరించుకొన్నాం. అలాగే గత ఆరున్నరేళ్ళుగా నగరంలో ఎక్కడా అల్లర్లు జరుగలేదు. శాంతిభద్రతల పరిస్థితి పూర్తి అదుపులో ఉంది. అసాంఘికశక్తులను ఏరివేసి ప్రజలకు భద్రత కల్పిస్తున్నాం.
సొంత ఇంటిని చక్కబెట్టుకోలేని యూపీ సిఎం యోగీ ఆధిత్యనాథ్ ఇక్కడకు వచ్చి హైదరాబాద్ గురించి, మన ప్రభుత్వం గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పడిన ఆరేళ్ళలోనే అన్ని రంగాలలో మనం నెంబర్ 1 స్థానంలో నిలుస్తున్నాము. ఈవిషయం కేంద్రప్రభుత్వంమే చెపుతోంది. అందుకు అనేక అవార్డులు కూడా ఇచ్చింది. కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలొచ్చేసరికి ఇక్కడ ఏదో ప్రళయం వచ్చేసినట్లు అందరూ దిగిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు. రాష్ట్ర బిజెపి నేతలైతే ముఖ్యమంత్రిననే గౌరవం కూడా లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారికి మేము ధీటుగా జవాబు చెప్పగలం. కానీ మాపై బాధ్యత ఉంది కనుక సంయమనం పాటిస్తున్నాం.
ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినవారు పనిచేసుకొంటున్నారు. స్థిరపడ్డారు. అందరినీ తెలంగాణ బిడ్డలా అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నాం. లాక్‌డౌన్ సమయంలో యూపీ, బిహార్, రాజస్థాన్, ఒడిశా, మద్యప్రదేశ్ తదితర రాష్ట్రాల కార్మికులు ఇక్కడ చిక్కుకుపోతే కేంద్రప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. వారందరికీ మేమే ఆహారం అందించాం. సొంత ఊర్లు వెళ్ళేందుకు రైలు ఛార్జీలు చెల్లించాం. ఇటువంటి సహృధ్భావ వాతావరణం ఉన్నప్పుడే అందరూ సుఖంగా జీవించగలరు. మనకు మతఘర్షణలు, అల్లర్లు అవసరమా? లేదా ఉద్యోగాలు చేసుకొంటూ మన పిల్లాపాపాలతో సుఖంగా జీవించడం అవసరమా? అందరూ ఆలోచించాలి.
వరదలతో నగరానికి ఇంత కష్టం వస్తే ఒక్క పైసా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కట్ట తెగిన వరదలా కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, బిజెపి నేతలు వచ్చేస్తున్నారు. ఈ బక్క కేసీఆర్‌ను ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది వస్తున్నారు. అదే నేను ఒక్కడిని ఢిల్లీ వస్తున్నానంటే భయంతో గజగజ వణుకుతున్నారు.
రాష్ట్రానికి ఇంతమంది కేంద్రమంత్రులు వస్తున్నారు కానీ ఎవరూ రాష్ట్రానికి, నగరానికి ఏమిచ్చారో చెప్పడం లేదు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు రూ.1,350 కోట్లు సాయం ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీకి లేఖ వ్రాస్తే ఇప్పటి వరకు 13 పైసలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఇంత వివక్ష చూపుతున్న పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? అందరూ ఆలోచించాలి.
ఇవాళ్ళ ఢిల్లీ నుంచి వస్తున్న నేతలు రేపు ఎన్నికలైపోగానే మరి కనబడరు కానీ నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. టిఆర్ఎస్ కూడా ఇక్కడే ఉంటుంది. కనుక మన సమస్యలను పరిష్కరించుకోవాలనే తపన ఇక్కడున్న మనకే ఉంటుంది తప్ప ఢిల్లీ నుంచి వచ్చినవాళ్ళకు ఎందుకుంటుంది? అని ప్రజలు ఆలోచించాలి.
కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి పైసా ఇవ్వలేదు కానీ వరదబాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.10,000 కూడా ఇవ్వకుండా బిజెపి నేతలు అడ్డుపడ్డారు. ఎన్నికలైపోగానే మళ్ళీ డిసెంబర్ 7 నుంచి అర్హులైనవారందరికీ రూ.10,000 చొప్పున వరదసాయం అందిస్తాం.
గత ఆరున్నరేళ్ళలో నగరంలో జరిగిన అభివృద్ధి మీ కళ్ళముందే ఉంది. కనుక ఆ అభివృద్ధిని చూసి మాకు ఓటేయమని అడుగుతున్నాను. మనం ఇప్పుడు ఒక్క తప్పు చేస్తే దానికి మనమే మూల్యం చెల్లించాలని అందరూ గుర్తుంచుకొని విచక్షణతో టిఆర్ఎస్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను. నగరం ఎప్పటికీ ఇలాగే అభివృద్ధిపదంలో సాగిపోవాలంటే టిఆర్ఎస్‌కు ఓటేయాలని కోరుతున్నాను. ఇదివరకు ఇచ్చిన సీట్లు కంటే మరో 4-5 సీట్లు ఎక్కువే ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను.