నేడు ఎల్బీ స్టేడియంలో నేడు సిఎం కేసీఆర్‌

ఇవాళ్ళ సాయంత్రం సిఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారసభ నిర్వహించనున్నారు. నగరంలో ఇంకా కరోనా వైరస్ ఉన్నందున సభకు కేవలం 30-40, 000 మందిని మాత్రమే అనుమతించబోతున్నట్లు పోలీసులు తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నామని టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. స్టేడియంలో భౌతికదూరం పాటిస్తూ కుర్చీలను, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రవేశద్వారాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. మాస్కు ధరించనిదే లోపలకు ఎవరినీ అనుమతించబోమని కర్నె ప్రభాకర్ తెలిపారు. సభలో భౌతికదూరం పాటించవలసి ఉన్నందున బయట ఉండిపోయినవారు కూడా ముఖ్యమంత్రి ప్రసంగం వినేందుకు వీలుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సభావేదిక నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. కర్నె ప్రభాకర్ దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. ముఖ్యమంత్రి సభకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేసి వాహనాలను వేరే మార్గంలోకి మళ్లిస్తున్నారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎల్బీ స్టేడియం చుట్టూ టిఆర్ఎస్‌ పార్టీ జెండాలు కట్టడంపై అభ్యంతరం చెపుతూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టిఆర్ఎస్‌పై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేసారు.