ఆ కుట్రదారులను అరెస్ట్ చేయించవచ్చు కదా?

కొన్ని రాజకీయ, అరాచక శక్తులు హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉందని, అటువంటి వారిని ఉపేక్షించవద్దని సిఎం కేసీఆర్‌ పోలీసులను ఆదేశించారు. 

దీనిపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. “అరాచక శక్తులు హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నాయని పక్కా సమాచారం ఉందని చెపుతున్న సిఎం కేసీఆర్‌, తక్షణమే వారిని అరెస్ట్ చేసి లోపలవేయాలని పోలీసులను ఎందుకు ఆదేశించడంలేదు?నగరంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని ముందే తెలిసి ఉన్నప్పుడు వారిని అరెస్ట్ చేయకుండా ఇంకా ఎందుకు వెనకడుతున్నారు?నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించిన తరువాత వారిని అరెస్ట్ చేయిస్తారా?” అని ప్రశ్నించారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపిని ఎదుర్కొలేకనే సిఎం కేసీఆర్‌ నగరంలో శాంతిభద్రతల అంశాన్ని తెరపైకి తెచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. సిఎం కేసీఆర్‌కు ధైర్యం ఉంటే పాతబస్తీలోని ప్రజలను రెచ్చగొడుతున్న మజ్లీస్‌ నేతలను అరెస్ట్ చేయించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తుంటాయి...పోతుంటాయి. వాటిలో లబ్ది   పొందేందుకు శాంతిభద్రతలకు భంగం కలిగించాలని బిజెపీ ఎన్నడూ కోరుకోదని బండి సంజయ్ అన్నారు.