శనివారం ఎల్బీ స్టేడియంలో సిఎం కేసీఆర్‌ సభ

ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు బిజెపి గట్టి పోటీనిస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఈసారి సిఎం కేసీఆర్‌ కూడా రంగంలో దిగుతున్నారు. ఈనెల 28వ తేదీ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. సిఎం కేసీఆర్‌ సభకు అగీకారం తెలుపడంతో వెంటనే సభావేదిక నిర్మాణపనులు మొదలుపెట్టేసి చకచకా పూర్తి చేస్తున్నారు. మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ్ళ మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంకు వెళ్ళి సభావేదిక నిర్మాణపనులను, ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి సభకు అవసరమైన బందోబస్తు గురించి సీపీ అంజనీకుమార్ టిఆర్ఎస్‌ నేతలతో చర్చించారు. 

ఇప్పటివరకు మంత్రి కేటీఆర్‌ చాలా జోరుగా రోడ్ షోలు నిర్వహిస్తూ, నగరంలోని వివిద వర్గాల ప్రజలతో సమావేశమవుతూ టిఆర్ఎస్‌ గెలుపుకోసం గట్టిగా కృషి చేస్తున్నారు. కానీ ఈసారి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, బిజెపి నేతలు ఊహించిన దానికంటే గట్టిగానే ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. బిజెపికి మజ్లీస్‌కు మద్య చాలా తీవ్రస్థాయిలో జరుగుతున్న మాటల యుద్ధాలు కూడా నగరంలోని హిందూ, ముస్లింలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఆ మేరకు టిఆర్ఎస్‌కు నష్టం కలిగే ప్రమాదం పొంచి ఉంది. టిఆర్ఎస్‌-బిజెపి-మజ్లీస్ పోరులో కాంగ్రెస్‌ వెనుకబడిపోయినప్పటికీ, దానికీ నగరంలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. కనుక వీటన్నిటివలన టిఆర్ఎస్‌కు నష్టం కలుగకుండా కాపాడుకొనేందుకు సిఎం కేసీఆర్‌ కూడా రంగంలో దిగుతున్నట్లు భావించవచ్చు. ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకొన్నప్పుడు సిఎం కేసీఆర్‌ ప్రజల మద్యకు వచ్చి మాట్లాడితే తప్పకుండా ఆలోచింపజేస్తుంది కనుక టిఆర్ఎస్‌ విజయావకాశాలు ఖచ్చితంగా మరింత మెరుగవుతాయి.