కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు జారీ

దేశంలో పలు రాష్ట్రాలలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండటంతో కరోనా కట్టడికి కేంద్రప్రభుత్వం మళ్ళీ నిన్న రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసి వాటిని ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కొత్త మార్గదర్శకాలు అమలులో ఉంటాయని కేంద్రం తెలిపింది. 

కొత్త మార్గదర్శకాలు: 

1. కొన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ లాక్‌డౌన్‌ విధించాలని భావిస్తున్నాయి. కానీ దానికి ముందుగా కేంద్రం అనుమతి పొందవలసి ఉంటుంది. కానీ అవసరమైతే కంటెయిన్మెంట్ జోన్లలో మాత్రమే రాత్రిపూట కర్ఫ్యూ విధించుకోవచ్చు.   

2. కంటెయిన్మెంట్ జోన్లలో మళ్ళీ ఇదివరకులాగే పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి. కంటెయిన్మెంట్ జోన్ల వివరాలను ప్రజలకు, కేంద్ర హోంశాఖకు తెలియజేసేందుకు ఆన్‌లైన్‌లో ఉంచాలి.  

3. మార్కెట్లు, పార్కులు, వారాంతపు సంతలు వంటి బహిరంగ ప్రదేశాలలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించడం, శానిటైజర్లతో చేతులు శుభ్రపరుచుకోవడం వంటి నిబందలను ఖచ్చితంగా అమలుచేయాలి. స్థానిక పోలీస్, మునిసిపల్, జిల్లా యంత్రాంగం దీనికి బాధ్యత వహించాలి. వైద్య ఆరోగ్యశాఖ వీటికి సంబందించి ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేస్తుంది.

4. బహిరంగ ప్రదేశాలలో అలాగే కార్యాలయాలలో కూడా మాస్కులు ధరించడం తప్పనిసరి. మాస్కులు ధరించని వారిపై జరిమానాలు విధించాలి.  

5. అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు కానీ ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ తప్పనిసరిగా కలిగిఉండాలి. 

6. అంతర్జాతీయ ప్రయాణాలపై నిబందనలకు లోబడి అనుమతి మంజూరు చేయబడుతుంది. 

7. గతంలో సూచించినట్లే కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల సినిమా థియేటర్లను 50 శాతం సామర్ధ్యంతో నడిపించుకోవచ్చు. స్విమ్మింగ్ పూ ల్స్‌లో కేవలం స్విమ్మింగ్ క్రీడాకారులకు మాత్రమే అనుమతి. 

8. సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, క్రీడా, విద్యా, వినోద, మతపరమైన కార్యక్రమాలలో ఆయా వేదికల సామర్ధ్యంలో 50 శాతానికి మించి హాజరయ్యేందుకు అనుమతి లేదు. 

9. వివాహాలు, అంత్యక్రియలు వగైరా శుభఅశుభ కార్యక్రమాలలో 200 మందికి మాత్రమే అనుమతి.