స్వామిగౌడ్ జంప్

టిఆర్ఎస్‌ సీనియర్ నేత, మాజీ కౌన్సిల్ ఛైర్మన్ స్వామిగౌడ్ ఇవాళ్ళ బిజెపిలో చేరిపోయారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయకండువా కప్పుకొన్నారు. స్వామిగౌడ్ వెంట ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎంపీ సిఎం రమేశ్ ఉన్నారు. 

అనంతరం స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న నావంటివారికి టిఆర్ఎస్‌లో ఇక చోటు లేదు. గౌరవమూ లేదు. తెలంగాణ జెండాను పట్టనివారిని సిఎం కేసీఆర్‌ చంకనెక్కించుకొని మావంటి ఉద్యమకారులను బయట ఎండలో నిలబెట్టారు. గత రెండేళ్ళలో కేసీఆర్‌ను కలిసేందుకు కనీసం వందసార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి ఉంటాను. కానీ ఒక్కసారి కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. స్వయంగా ఉద్యమకారుడైన సిఎం కేసీఆర్‌ ఉద్యమకారులపట్ల ఇంత చులకనగా వ్యవహరించడం కష్టంగా అనిపించింది. టిఆర్ఎస్‌లో ఇంకా చాలా మంది ఉద్యమకారులు మౌనంగా అవమానాలు భరిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన బిజెపి, ఉద్యమకారులను సముచితంగా గౌరవిస్తుందనే నమ్మకంతోనే బిజెపిలో చేరాను. బిజెపిలో చేరడంతో మళ్ళీ తల్లి చెంతకు చేరిన భావన కలుగుతోంది. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి గెలిచి మేయర్ పదవిని దక్కించుకోవడం ఖాయం,” అని అన్నారు.