రేపు బిజెపిలో చేరనున్న విజయశాంతి

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి రేపు ఢిల్లీ వెళ్ళి ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయకండువా కప్పుకోనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరువాత ఆమె బిజెపిలో చేరుతారని ఊహాగానాలు వినిపించాయి. కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న రాష్ట్ర బిజెపి నేతలు ఆమెను వెంటనే పార్టీలో చేరి ఎన్నికలలో ప్రచారంలో పాల్గొనవలసిందిగా కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ప్రతీ రోజూ చాలా విలువైనదే. వారి సూచనపై సానుకూలంగా స్పందించిన విజయశాంతి రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళేందుకు సిద్దమయ్యారు. కనుక రేపు మధ్యాహ్నం ఆమె బిజెపిలో చేరి మళ్ళీ రాత్రిలోగా హైదరాబాద్‌ తిరిగివచ్చి ఎల్లుండి నుంచి బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.

విజయశాంతిని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పట్టించుకోకపోవడంతో ఆమె చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్ పర్సన్ అయినప్పటికీ పార్టీకి ఎంతో కీలకమైన దుబ్బాక ఉపఎన్నికలకు, ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కూడా దూరంగా ఉండిపోయారు. కనుక ఆమె కాంగ్రెస్‌ పార్టీని వీడినా ఆ పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ దుబ్బాక ఉపఎన్నికలలో విజయంతో సమారోత్సాహంతో ఉన్న బిజెపి మాత్రం ఆమె వలన చాలా లబ్ది పొందే అవకాశం ఉంది.   

 బిజెపికి మద్దతుగా జనసేన పార్టీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కనుక పవన్‌ కల్యాణ్‌ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.