రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఇప్పటివరకు టిఆర్ఎస్ బలహీనపరచగా ఇప్పుడు బిజెపి దాని వెంటపడుతోంది. ఇవాళ్ళ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బిజెపి, మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి హైదరాబాద్‌లోని మహేంద్ర హిల్స్ లోని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. వారు సర్వేను బిజెపిలో చేరవలసిందిగా కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే బిజెపిలో చేరుతానని, తనతో పాటు పలువురిని బిజెపిలోకి తీసుకువస్తానని చెప్పారు.
2018 శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన తరువాత ఆయన రాష్ట్ర అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. అప్పటి నుంచి సర్వే సత్యనారాయణ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ లోకి లేదా టిఆర్ఎస్‌లోకి వెళ్ళే అవకాశం లేకపోవడం, ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో సర్వే సత్యనారాయణ ఇంతకాలం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలలో నాలుగు సీట్లు గెలుచుకొన్న బిజెపి, తాజాగా దుబ్బాక ఉపఎన్నికలో కూడా విజయం సాధించి టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బలపడుతోంది. పైగా కేంద్రంలో బిజెపియే అధికారంలో ఉంది. కనుక ఇంతకాలంగా ఎదురుచూస్తున్న ఆ అవకాశం బిజెపి రూపంలో వెతుకొంటూ రావడంతో సర్వే సత్యనారాయణ వెంటనే బిజెపిలో చేరేందుకు అంగీకరించారు.
సీనియర్ కాంగ్రెస్ నేత విజయశాంతిని కూడా ఇటీవల బిజెపి నేతలు కలిశారు. ఆ తరువాత నుండే ఆమె తన పేరు క్రింద ‘కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్ పర్సన్’ అని వ్రాసుకోవడం మానేశారు. బహుశః ఆమె కూడా బిజెపిలోకి వెళ్లిపోయే ఉద్దేశ్యంతో ఉన్నందునే ఆవిధంగా చేసి ఉండవచ్చు. వీరిరువురితో పాటు మాజీ కాంగ్రెస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా బిజెపిలోకి రప్పించేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశః జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరువాత వారు ముగ్గురూ లేదా ఇద్దరు బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.