
తెరాస నేత డి.శ్రీనివాస్ హైదరాబాద్‌లోని తన నివాసంలో నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “జీహెచ్ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్ తనకు అలవాటైన జిమ్మిక్కులన్నిటినీ ప్రదర్శిస్తోంది. 67,000 కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పుకొంటున్నప్పుడు, ఎన్నికలలో ఈ జిమ్మిక్కులు చేయడం ఎందుకు? మీ పనిని చూసి ప్రజలే మీకు ఓట్లు వేస్తారు కదా? కానీ ప్రజలు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని గ్రహించినందునే టిఆర్ఎస్ జిమ్మిక్కులు ప్రదర్శిస్తోంది. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను గుర్తుంచుకొని అమలుచేసి విశ్వసనీయత పెంచుకోవాలి కానీ మాయమాటలతో ప్రజలను ఎల్లకాలం మభ్యపెట్టగలమనుకోవడం అవివేకం. ప్రజల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందుగా వరదలతో నష్టపోయిన ప్రజలందరినీ ఆదుకోవాలి. వరదలతో అష్టకష్టాలు పడుతున్న ప్రజల నెత్తిన ఈసమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల భారం మోపడం సరికాదు. అయినా షెడ్యూల్ ప్రకటించకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటి? నా రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇటువంటి ఎన్నికలను చూడలేదు. రెండుసార్లు సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఎన్నికల హామీలను అమలుచేయలేదు. మళ్ళీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్దమైపోయింది. టిఆర్ఎస్ మాటలను హైదరాబాద్ ప్రజలు నమ్ముతారని నేను అనుకోవడం లేదు. నేను టిఆర్ఎస్లోనే ఉన్నాననే సంగతి పార్టీ అధిష్టానం ఎప్పుడో మరిచిపోయింది,” అని అన్నారు.
టిఆర్ఎస్ తనను మరిచిపోయి చాలా కాలమే అయ్యిందంటున్న డి.శ్రీనివాస్ ఇంకా ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారో తెలీదు. టిఆర్ఎస్ తనను పట్టించుకోవడం లేదని గ్రహించినప్పుడు పార్టీని వీడి తనకు నచ్చిన పార్టీలో చేరి మళ్ళీ రాజకీయాలలో పాల్గొనవచ్చు లేదా రాజకీయాల నుంచి తప్పుకొని హాయిగా జీవించవచ్చు. కానీ టిఆర్ఎస్లోనే ఉంటూ ఆ పార్టీని ఈవిధంగా విమర్శించడం సరికాదు. దాని వలన ఆయనకు ఒరిగేదేమీ ఉండదు కానీ ఆయనే ప్రజల దృష్టిలో చులకనవుతారని గ్రహిస్తే మంచిది.