బీజేపీ నేతలకి కేటీఆర్ సవాల్

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం మధ్యాహ్నం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్‌ డ్‌ ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. 

వరదసాయం పంపిణీలో అవకతవకలపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఓ పక్క నగరంలో భారీ వర్షం కురుస్తుండగానే మా ప్రభుత్వం మానవత్వంతో స్పందించి వెంటనే వరదసాయం సొమ్ము పంపిణీ ప్రారంభించింది. దేశంలో ఇటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?ఇప్పటి వరకు 6.5 లక్షల మందికి పైగా వరదసాయం అందించాము. దాని కోసం మా ప్రభుత్వం రూ.650 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇన్ని లక్షల మందికి పంపిణీ చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. లోపాలు చోటు చేసుకొంటుంటాయి. వాటిని మేము సరిదిద్దుకొని ముందుకు సాగుతున్నాము. 

మీ-సేవా కేంద్రాలవద్ద ప్రజలు బారులు తీరడానికి కూడా మమ్మల్నే నిందిస్తున్నవారు ఒకటి గమనించాలి. అది ప్రజలకు మాపై ఉన్న నమ్మకంగా ఎందుకు చూడలేరు. వారికి ప్రభుత్వం తప్పకుండా సాయం అందిస్తుందనే నమ్మకం ఉంది కనుకనే వారు ఓపికగా క్యూలైన్లో నిలబడ్డారని నేను అంటాను. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలున్నాయీ కనుక నగరంలో వరదసాయం అందిస్తున్నామని కొందరు వాగుతున్నారు. కానీ ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కాదు హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న అన్ని మునిసిపాలిటీలలో వరదసాయం అందిస్తోంది మా ప్రభుత్వం. మేము మంత్రులం స్వయంగా వరదబాధిత ప్రాంతాలలో పర్యటించి వారి కష్టాలను తెలుసుకొని ఓదార్చి వారికి సాయం చేస్తున్నాము. కానీ కాంగ్రెస్‌, బిజెపి నేతలు అప్పుడు ఎక్కడకు వెళ్ళిపోయారు? ఎందుకు వరదబాధితులను పరామర్శించలేదు? మరిప్పుడు వాళ్ళు ఏ మోహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారు?

నగరంలో వరదలొస్తే కేంద్రం దమ్మీడీ విదిలించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీకి పరిస్థితులను వివరిస్తూ లేఖ వ్రాసినా పట్టించుకోలేదు. కనుక కష్ట సమయంలో ప్రజల పక్కన నిలబడి పనిచేసిన మాకు ఓట్లు వేయాలా? లేకపోతే హిందూ, ముస్లిం, ఇండియా పాకిస్తాన్ అంటూ పనికిమాలిన రాజకీయాలు చేసే బిజెపికి వేయాలో ప్రజలే ఆలోచించుకోవాలి. నేను బిజెపి నేతలకు సవాలు చేస్తున్నాను. గత ఆరేళ్లలో మా ప్రభుత్వం హైదరాబాద్‌లో చేసిన వంద పనులను చూపించగలను. కేంద్రప్రభుత్వం చేసిన ఒకే ఒక పనిని చూపించగలరా?” అని ప్రశ్నించారు.