
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు రేపు ఒక్కరోజే గడువు ఉంది. ఇటువంటి సమయంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ అలకపాన్పు ఎక్కారు. అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక, బీ-ఫారంలు అందజేయడం వంటి వ్యవహారాలలో తనను సంప్రదించకుండానే రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు తీసుకొందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నామినేషన్లకు సమయం తక్కువగా ఉండటంతో అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవలసివచ్చిందని, కనుక పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సహకరించవలసిందిగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు తనకు విజ్ఞప్తి చేయడంతో బెట్టువీడి మళ్ళీ ఎన్నికలపై దృష్టిపెట్టానని అంజన్‌కుమార్ యాదవ్ స్వయంగా చెప్పారు.
ఎన్నికల సమయంలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో తాను పార్టీని వీడి బిజెపిలో చేరబోతున్నానంటూ మీడియాలో వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. “తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిని నేను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ వీడను. నేను అసంతృప్తి చెందడం వాస్తవమే కానీ నా అభిప్రాయాలను పార్టీ కూడా గౌరవిస్తోంది. కనుక పార్టీని వీడే ఉద్దేశ్యం లేదు. అయినా టిఆర్ఎస్, మజ్లీస్, బిజెపి మూడు ఒక్కటే. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నూటికి నూరు శాతం సెక్యులర్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని వీడి మతతత్వ బిజెపిలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. ఈ ఎన్నికలలో మా పార్టీని గెలిపించుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను. మేమే తప్పకుండా గెలుస్తామని భావిస్తున్నాను,” అని అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు.