
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ధరణీ పోర్టల్ ద్వారా ఇప్పటికే వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్స్, యాజమాన్యపు హక్కుల బదిలీ(మ్యూటేషన్) విజయవంతంగా కొనసాగుతున్నాయి. కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దారులకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్స్ చేసే బాధ్యతలు, అధికారాలు దఖలుపరచడంతో వారు ధరణీ పోర్టల్ ద్వారా విజయవంతంగా రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు.
ఈనెల 23వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్స్ ప్రక్రియను ధరణీ పోర్టల్ ద్వారానే ఎప్పటిలాగే సబ్-రిజిస్ట్రార్స్ చేస్తారు.
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్స్ చేసేందుకు వీలుగా ధరణీ పోర్టల్‌ను రెండు విభాగాలుగా విభజించినందున ఎటువంటి గందరగోళం చోటుచేసుకొనే అవకాశం ఉండదు. తహసీల్దారులే వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్స్ చేస్తున్నందున రైతులు జిల్లా కేంద్రాలలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు పడిగాపులు కాయనవసరం ఉండదు. గతంలో రిజిస్ట్రేషన్ అయిన తరువాత వాటికోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ధరణీ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మ్యూటేషన్ సర్టిఫికేట్లు కూడా వెంటనే లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మ్యూటేషన్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన రుసుమును చెల్లిస్తే చాలు వెంటనే మ్యూటేషన్ సర్టిఫికేట్ చేతికి వచ్చేస్తోంది. అంతేకాదు... ధరణీ పోర్టల్‌లో మ్యూటేషన్ ప్రక్రియ పూర్తవగానే వెంటనే పంచాయతీ రికార్డులలోకి కూడా వచ్చేస్తోంది.
వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్స్ ప్రక్రియను రెండుగా విభజించి, తహసీల్దారులకు, సబ్-రిజిస్ట్రార్లకు బాధ్యతలు అప్పగించినందున, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఒత్తిడి కూడా తగ్గి వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
రిజిస్ట్రేషన్ కోసం మీ-సేవా కేంద్రాలలో లేదా స్థానిక తహసీల్దార్ కార్యాలయాలలో ధరణీ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకోగానే, వరుసగా తదుపరి ప్రక్రియకు సంబందించిన వివరాలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటి ప్రకారం డాక్యుమెంట్స్, ధృవపత్రాలు, చలానా, వగైరా అన్ని సమర్పిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులువుగా పూర్తయిపోతుండటంతో ఈ కొత్త విధానం పట్ల రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు.