
జేడీయూ అధినేత నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా నిన్న సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. దీంతో వరుసగా 4వ సారి, మొత్తం ఏడుసార్లు ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టినట్లయింది. పాట్నాలోని రాజ్‌భవన్‌లో నిరాడంభారంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఫాగూ చౌహాన్ నితీష్ కుమార్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు మొత్తం 14 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో బిజెపికి చెందిన తారా కిషోర్ ప్రసాద్, రేణుదేవిలు ఉప ముఖ్యమంత్రి పదవులు పొందారు. బిజెపి నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, ఎన్డీయే మిత్రపక్షాలైన విఐపీ, హెచ్ఏఎం పార్టీల నుంచి చెరొకరికి మంత్రి పదవులు లభించాయి. ఈ కార్యక్రమానికి కేంద్రహోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుశీల్ మోడీ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు హాజరయ్యారు.
నితీష్ కుమార్ పార్టీ(జేడీయూ)కి బిజెపి కంటే చాలా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై ప్రతిపక్షాలు వ్యంగ్యంగా చురకలు వేస్తున్నాయి.
‘బిజెపి నామినేటడ్ సిఎం నితీష్ కుమార్‌కు అభినందనలు’ అని ఆర్‌జెడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు.
‘నితీష్ కుమార్‌కు అభినందనలు. ఆయన బిజెపి దయతో 5 ఏళ్ళు ఆ పదవిలో కొనసాగుతారని ఆశిస్తున్నాము,’ అని లోక్‌జనశక్తి పార్టీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ అన్నారు.
‘అలసిపోయిన ముఖ్యమంత్రి నీరసమైన పాలనను బిహార్ ప్రజలు అనుభవించక తప్పదు,’ అని అన్నారు నితీష్ కుమార్ మాజీ సహచరుడు, ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్.