తెలంగాణలో ఇంటిపన్నుపై 50 శాతం మాఫీ

మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలో గృహాయజమానులకు ఓ శుభవార్త చెప్పారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఇళ్ళు దెబ్బతిన్నందున 2020-21 సం.లో ఇంటిపన్నులో 50 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమైన హైదరాబాద్‌ నగరంలో (జీహెచ్‌ఎంసీ పరిధిలో) రూ.15,000లోపు వార్షిక ఆస్తిపన్ను చెల్లించేవారికి 50 శాతం, అదేవిధంగా రాష్ట్రంలో మిగిలిన 140 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలోని రూ. 10,000 లోపు వార్షిక ఆస్తిపన్ను చెల్లించేవారికి 50 శాతం మాఫీ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. 

దీనివలన ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 13.72 లక్షల ఇళ్ళ యజమానులకు, రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలోని 31.40 లక్షల ఇళ్ళ యజమానులకు లబ్ధి కలుగుతుందని అన్నారు. హైదరాబాద్‌లోని ఇళ్ళకు మొత్తం రూ.196.48 కోట్లు, రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలోని ఇళ్లకు రూ.326.48 కోట్లు కలిపి మొత్తం రూ.522.96 కోట్లు రాయితీ లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సిఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఆస్తిపన్నులో 50 శాతం మాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే ఆస్తిపన్ను చెల్లించినవారికి తదుపరి ఆస్తిపన్నులో దీనిని సర్దుబాటు చేస్తామని చెప్పారు. 

రూ.10,000-15,000 లోపు వార్షిక ఆస్తిపన్నులో 50 శాతం మాఫీ చేయడం వలన రాష్ట్రవ్యాప్తంగా సామాన్య, మద్యతరగతి వాళ్ళందరికీ లబ్ది కలుగుతుంది. లాక్‌డౌన్‌, కరోనా భయాలు, వరదలతో నానా కష్టాలు పడిన ప్రజలకు ఇది చాలా ఉపశమనం కలిగించే విషయమే.