
దీపావళి కానుకగా జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచుతున్నట్లు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పారిశుధ్య కార్మికులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది జీతాలను రూ.14,000 నుంచి రూ.17,000 లకు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంతమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలనురూ. 14,000 నుంచి రూ.17,500 లకు పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వారందరూ కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి చాలా ధైర్యంగా క్వారెంటైన్ ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అందుకే దీపావళి కానుకగా వారందరికీ జీతాలు పెంచుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎఫ్,ఈఎస్ఐలతో కలిపి ఈ పెంపు ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.