
సిఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దుబ్బాకలో మన శక్తిమేర కృషి చేశాము కానీ ఆశించిన ఫలితం రాలేదు. అయినా ఆ ఓటమికి మనం క్రుంగిపోనవసరం లేదు. దుబ్బాకలో గెలిచినందున జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మేమే గెలుస్తామని బిజెపివాళ్ళు పగటికలలు కంటున్నారు. వారిని పగటికలలు కననివ్వండి. మన పని మనం చేసుకుపోదాం.
గత ఆరేళ్ళుగా హైదరాబాద్ నగరాన్ని ఎంతగా అభివృద్ధి చేశామో...ఎన్ని సంక్షేమ పధకాలు చేపట్టామో నగర ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా హైదరాబాద్ అభివృద్ధికి మన ప్రభుత్వం చేసినవన్నీ ప్రజలకు మళ్ళీ వివరించండి. మనం చేసిన అభివృద్ధి పనులు, అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలే మనకు శ్రీరామరక్ష. అవే మనల్ని జీహెచ్ఎంసీ ఎన్నికలలో తప్పకుండా గెలిపిస్తాయి.
దీపావళి తరువాతజీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. డిసెంబర్లోనే ఎన్నికలుంటాయి. కనుక తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పూర్తి సమన్వయంతో పనిచేసి ఈ ఎన్నికలలో విజయం సాధించాలి. పార్టీ నేతల మద్య భేధాభిప్రాయాలుంటే వాటిని పక్కనపెట్టి పార్టీ గెలుపుకోసం అందరూ కలిసి పనిచేయాల్సిందే లేకుంటే కటిన చర్యలు తప్పవు. ఈ ఎన్నికలలో కేవలం గెలుపు గుర్రాలకే అవకాశం కల్పిస్తాము కనుక పార్టీలో అందరూ వారికి అన్నివిధాల సహకరించాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కధ ఎప్పుడో ముగిసిపోయింది. ఒకటి రెండు ఎన్నికలతో రాష్ట్రంలో బలపడ్డామని బిజెపి భ్రమలో ఉంది. హైదరాబాద్ నగరంలో బిజెపికి అసలు పట్టేలేదు. కనుక జీహెచ్ఎంసీ ఎన్నికలలో బిజెపికి ఆ విషయం అర్ధమయ్యేలా చేద్దాం,” అని అన్నారు.