
దుబ్బాక ఉపఎన్నికలలో పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక స్వామి అనే టిఆర్ఎస్ కార్యకర్త మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకొన్నాడు. సిద్ధిపేట జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలోని కొనాయిపల్లి గ్రామంలో ఈ విషాదఘటన జరిగింది. ఈ ఉపఎన్నికలలో చాలా చురుకుగా పనిచేసిన స్వామి, టిఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని నమ్మకంతో ఉండేవాడు. కానీ స్వల్ప ఓట్ల తేడాతో టిఆర్ఎస్ ఓటమి పాలవడంతో జీర్ణించుకోలేక ఫలితాలు వెలువడిన రోజు రాత్రే ఇంట్లో ఆత్మహత్య చేసుకొన్నాడు.
ఈ సమాచారం అందుకొన్న మంత్రి హరీష్రావు హుటాహుటిన నిన్న ఉదయం స్వామి ఇంటికి చేరుకొని అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్వామికి నివాళులు అర్పించి అతని అంత్యక్రియలలో స్వయంగా పాడె మోశారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “టిఆర్ఎస్ కోసం స్వామి చాలా కష్టపడి పనిచేశాడు. అతను ఆత్మహత్య చేసుకొన్నాడని విని నేను చాలా బాధపడ్డాను. ఎన్నికలలో పార్టీలకు గెలుపోటములు చాలా సహజం. కనుక ఓడినప్పుడు ధైర్యంతో ముందుకు సాగాలే తప్ప క్షణికావేశంతో ఇటువంటి పనులు చేయకూడదు. అలా చేస్తే కుటుంబసభ్యులకు అన్యాయం చేసినవారం అవుతాము,” అని అన్నారు.
మంత్రి హరీష్రావు స్వామి కుటుంబ సభ్యులకు పార్టీ తరపున రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందజేశారు. టిఆర్ఎస్ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.