నితీష్ కుమార్‌కు మళ్ళీ జైకొట్టిన బిహార్‌ ప్రజలు

బిహార్‌ శాసనసభ ఎన్నికలలో మళ్ళీ అధికార జేడీయు-బిజెపి కూటమి(ఎన్డీయే)కే ప్రజలు జైకొట్టారు. మొత్తం 243 స్థానాలలో ఎన్డీయే 124స్థానాలు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తోంది. ఈసారి బిహార్‌ ఎన్నికలలో ప్రధానప్రతిపక్షం ఆర్‌జేడీ-కాంగ్రెస్‌-వామపక్షాల ‘మహాకూటమి’ చేతిలో ఎన్డీయే ఓడిపోతుందని పలు సర్వేలు ప్రకటించగా అందుకు భిన్నంగా స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. ఈ ఎన్నికలలో ఆర్‌జేడీ-కాంగ్రెస్‌-వామపక్షాల మహాకూటమి గట్టి పోటీయే ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు అవసరంకాగా అది 111 స్థానాలు గెలుచుకొంది. మరో 10-12 స్థానాలు గెలుచుకొని ఉంటే దానికే అధికారం లభించి ఉండేది. ఈ ఎన్నికలలో ఎన్డీయే గెలిచినందున మళ్ళీ నితీష్ కుమార్‌ వరుసగా 4వసారి బిహార్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టి సరికొత్త రికార్డ్ సృషించబోతున్నారు. బిహార్‌ ఎన్నికలలో పోటీ చేసిన మజ్లీస్ పార్టీ కూడా 5 సీట్లు గెలుచుకొని బోణీ కొట్టింది. ఈ ఎన్నికలలో ఎన్డీయేకు 38.4 శాతం, మహాకూటమికి 37.3 శాతం, ఎల్‌జేపీకి 5.6, ఇతరులకు 18.7 శాతం ఓట్లు లభించాయి. 

పార్టీలవారీగా గెలుచుకొన్న స్థానాలు: 

ఎన్డీయే:  బిజెపి-73, జేడీయు-43, హెచ్ఏఎంఎస్-4, వీఐపీ-4, 

మహాకూటమి: ఆర్జేడీ-76, కాంగ్రెస్‌-19, సిపిఐ-2, సిపిఎం-2, సిపిఐ ఎంఎల్-12,

ఇతర పార్టీలు: ఎంఐఎం(మజ్లీస్)-5, ఎల్జెపీ-1, బీఎస్పీ-1, స్వతంత్రులు- 1 సీట్లు గెలుచుకొన్నారు.