దుబ్బాక ఓటమిపై హుందాగా స్పందించిన మంత్రి కేటీఆర్‌

దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ ఓటమిపై తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చాలా హుందాగా స్పందించారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు  ఏ ఎన్నికలు వచ్చినా ప్రతీ ఎన్నికలలోనూ టిఆర్ఎస్‌ అప్రతిహతంగా గెలుస్తూనే ఉంది. మేము ఏ ఎన్నికలలో గెలిచినా కూడా ఒకటే చెపుతాము. విజయాలకు పొంగిపోము... అపజయాలకు క్రుంగిపోమని! ఇప్పుడే అదే చెపుతున్నాం. 

దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఓటు వేసిన 60,000 పైచిలుకు ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. అలాగే పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా మంత్రి హరీష్‌రావుగారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ ఎన్నికలలో మేము ఆశించిన రీతిలో ఫలితం రాలేదు కనుక దీనిపై త్వరలో పార్టీలో సమీక్షించుకొని ముందుకు సాగుతాము. ఈ ఓటమి మా పార్టీ నేతలు,కార్యకర్తలను అప్రమత్తం చేసేందుకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ ఓటమితో సంబంధం లేకుండా రాష్ట్రంలో మేము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగిపోతాము. దుబ్బాక ఉపఎన్నికలలో మాకు ఓట్లు వేసిన ఓటర్లకు, పార్టీ గెలుపు కోసం కృషి చేసినవారందరికీ మళ్ళీ మరోసారి పేరుపేరునా టిఆర్ఎస్‌ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.