ట్రంప్‌ ఓటమి...నితీష్ కుమార్‌కు ఓ గుణపాఠం

ఈ ప్రపంచంలో తనకే ఎదురేలేదని విర్రవీగిన డోనాల్డ్ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికలలో అనూహ్యంగా ఓడిపోవడంపై సహజంగానే యావత్ ప్రపంచదేశాలలో రకరకాలుగా రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని శివసేన పార్టీ కూడా తనదైన శైలిలో ట్రంప్‌ ఓటమిని విశ్లేషించింది. ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ట్రంప్‌ ఓటమి నుంచి బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీలు గుణపాఠం నేర్చుకోవాలన్నారు. 

“ఆ అత్యున్నత పదవికి డోనాల్డ్ ట్రంప్‌ అర్హుడు కాకపోయినా ప్రజలు ఎన్నుకోవడంతో ఆయనకు ఆ పదవి, హోదా, అధికారం లభించాయి. కానీ ఆయన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక ఓడిపోయాడు. అమెరికాలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. అలాగే కరోనా సమస్య కూడా వచ్చి పడింది. కానీ ట్రంప్‌ వాటిని పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేశారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. దాంతో ప్రజలు ఆయనను గద్దె దించి నాలుగేళ్ళ క్రితం చేసిన తమ తప్పును సరిదిద్దుకొన్నారు. ఇక్కడ బిహార్‌ సిఎం నితీష్ కుమార్‌కు కూడా అదే వర్తిస్తుంది. శాసనసభ ఎన్నికలలో ఆయన, ప్రధాని నరేంద్రమోడీ కలిసి ప్రచారం చేసినా వారి కూటమికి గెలిచే అవకాశం కనబడటం లేదు. ఇక్కడ తేజస్వీ యాదవ్, అక్కడ జో బైడెన్‌ ఇద్దరూ అబద్దాలకు, అన్యాయానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. ఈ పోరాటంలో అక్కడ జో బైడెన్‌ గెలిచారు. ఇక్కడ తేజస్వీ యాదవ్ కూడా గెలువబోతున్నారు. మనం తప్ప ప్రజలకు వేరే గతి లేదనే గుడ్డి నమ్మకం నుంచి నాయకులందరూ బయటపడి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ప్రతీ రాజకీయనాయకుడు తెలుసుకోవాలి. ట్రంప్‌ ఓటమి నుంచి అందరూ గుణపాఠం నేర్చుకొంటే మంచిది,” అని సామ్నా పత్రిక సంపాదకీయ సారాంశం.