దుబ్బాక ఫలితాలపై మీడియా అంచనాలు

దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సార్వత్రిక ఎన్నికల స్థాయిలో హోరాహోరీగా పోరాడటంతో వాటిలో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దుబ్బాక ఉపఎన్నికలపై నాలుగు జాతీయస్థాయి మీడియా సంస్థలు తమ అంచనాలను (ఎగ్జిట్ పోల్స్) ప్రకటించాయి. వాటిలో ‘ఆరా, థర్డ్ విజన్ సంస్థలు టిఆర్ఎస్‌ గెలుస్తుందని అంచనా వేయగా, చాణక్య, ద పోలిటికల్ లేబొరేటరీ సంస్థలు బిజెపి గెలుస్తుందని అంచనా వేసాయి. 

ఆరా సర్వే ఫలితాలు:

టిఆర్ఎస్‌ అభ్యర్ధి  సోలిపేట సుజాత 48.72 శాతం ఓట్లతో గెలుస్తారని చెప్పింది. బిజెపి అభ్యర్ధి రఘునందన్‌  రావుకు 44.64 శాతం ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 6.12 శాతం ఓట్లు, ఇతరులకు 2.52 శాతం ఓట్లు  వస్తాయని ‘ఆరా’ అంచనా వేసింది. 

థర్డ్ విజన్ సర్వే ఫలితాలు: 

టిఆర్ఎస్‌ 51.54 శాతం ఓట్లు సాధించి గెలుస్తుందని తెలిపింది. బిజెపికి 33.36 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 8.11 శాతం ఓట్లు మాత్రమే పడతాయని అంచనా వేసింది. 

చాణక్య సర్వే ఫలితాలు: 

చాణక్య సంస్థ బిజెపికి 51.82 శాతం ఓట్లు (83,729 ఓట్లు)తో గెలుస్తుందని అంచనా వేసింది. ఈ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్‌కు 35.67 శాతం ఓట్లు (58,356 ఓట్లు), కాంగ్రెస్‌కు 12.15 శాతం ఓట్లు (19,194) ఇతరులకు కేవలం 769 ఓట్లు మాత్రమే పడతాయని తెలిపింది. 

ద పోలిటికల్ లేబొరేటరీ సర్వే ఫలితాలు: 

బిజెపి 47 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని తెలిపింది. టిఆర్ఎస్‌కు 38 శాతం, కాంగ్రెస్‌కు 13 శాతం ఓట్లు లభిస్తాయని అంచనావేసింది.