.jpg)
దుబ్బాక ఉపఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాయి. త్వరలో జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు మూడు పార్టీలు హైదరాబాద్‌ను యుద్ధక్షేత్రంగా చేసుకొని పోరాడేందుకు సిద్దమవుతున్నాయి. ఆ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్, బిజెపిలు ఆరోపించగా, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వాటికి ధీటుగా సమాధానం ఇచ్చారు.
ఆదివారం పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “హైదరాబాద్ నగర ప్రజలు వరదలలో అల్లాడుతుంటే కాంగ్రెస్, బిజెపి నేతలు దుబ్బాకలో కూర్చోన్నారు. కానీ నాతో సహా కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నేతలు నగరంలో వర్షంలో తడుస్తూ నీళ్ళలో నడుస్తూ వరదబాధితులను పరామర్శించి వారికి అండగా నిలిచాము. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు కానీ వరదబాధితుల కష్టాలను చూసి చలించిపోయిన సిఎం కేసీఆర్ వెంటనే రూ.550 కోట్లు విడుదల చేశారు. వెంటనే 920 అధికార బృందాలను ఏర్పాటు చేసి ఒకే రోజున లక్షమందికి పైగా వరదబాధితులకు ఆ సాయాన్ని అందజేశాము. ఇప్పటివరకు 4.32 లక్షల మందికి వరదసాయం అందజేశాము. వారి వివరాలన్నీ మా రికార్డులలో ఉన్నాయి. కావాలంటే ప్రతిపక్షాలు పరిశీలించుకోవచ్చు.
గుజరాత్లో వరదలొస్తే ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా హెలికాఫ్టరులో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి తక్షణ సహాయం రూ.500 కోట్లు విడుదల చేశారు. కర్ణాటకకు అడిగిన వెంటనే రూ.669.85 కోట్లు ఇచ్చారు. కానీ రాష్ట్రానికి కష్టం వచ్చిందని వెంటనే 8,868 కోట్లు తక్షణ సహాయం అందించాలని సిఎం కేసీఆర్ గత నెల 15న ప్రధానికి లేఖ వ్రాసినా పట్టించుకోలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ వ్రాస్తే పట్టించుకోరా? తెలంగాణ రాష్ట్రం భారత్‌లో లేదా? ఆ రెండు రాష్ట్రాలే ఉన్నాయా?
తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు కట్టింది. దేశానికి ఇంత భారీగా ఆదాయం అందిస్తూ దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోదా?రాష్ట్రానికి దమ్మిడీ విదిలించకపోగా మళ్ళీ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపధకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందంటూ రాష్ట్ర బిజెపి నేతలు నిసిగ్గుగా అబద్దాలు చెప్పుకొంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ వరదబాధితుల కోసం మొసలి కన్నీరు కార్చుతున్నారు. రాష్ట్రంలో నలుగురు బిజెపి ఎంపీలు, ఒక కేంద్రమంత్రి ఉన్నారు. కానీ ఏం లాభం?ఒక్కరూ కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకురాలేరు. వారా... మా ప్రభుత్వాన్ని విమర్శించేది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ నిసహాయమంత్రిగా మిగిలిపోయారు,” అని కేటీఆర్ ఆక్షేపించారు.