బిజెపి వైపు...రాములమ్మ మరో అడుగు?

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి బిజెపివైపు మెల్లగా అడుగులు వేస్తున్నట్లున్నారు. ఆమె సొంత పార్టీని విమర్శిస్తూ, బిజెపిని సమర్ధిస్తున్నట్లు ఆమె పెట్టిన తాజా ట్వీట్స్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది.  

“తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిఆందోళనకరంగా ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఇలాంటి పరిస్థితి రావడం బాధగా ఉంది. విజయశాంతిగారి సేవలను పార్టీ పూర్తి స్థాయిలో వాడుకోవడంలో విఫలమైంది,” అంటూ సీనియర్ కాంగ్రెస్‌ నేత మధూయాష్కీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ, “రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు నాయకులు ఛానెల్స్ లో లీకేజీల ద్వారా నాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తున్నారు. వాస్తవాలను మాట్లాడిన మధుయాష్కీగారికి నా ధన్యవాదాలు,” అని విజయశాంతి ట్వీట్ చేశారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం వలననే బిజెపి టిఆర్ఎస్‌ను సవాలు చేసే స్థాయికి ఎదిగిందని, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌ను ప్రజలే నిర్ణయించాలన్నారు. సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించి, ఎవరు తీసుకొన్న గోతిలో వారే పడతారనే సామెత ఆయనకు వర్తించే సమయం ఆసన్నమైందన్నారు. సిఎం కేసీఆర్‌ కొందరు కాంగ్రెస్‌ నేతలను భయపెట్టి లేదా ప్రలోభపెట్టి పార్టీ వారి ద్వారా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్‌లో చేర్పించుకొన్నారని విజయశాంతి ఆరోపించారు.