
ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలలో నష్టపోయినవారిని ఆడుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.550 కోట్లు కేటాయించి, భాదిత కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్ధికసాయం అందించింది. కానీ నగరంలో చాలా మందికి ఆ సొమ్ము అందకపోవడంతో వారు అధికారులు, కార్పొరేటర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల వరదబాధితులు దాని కోసం ధర్నాలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును టిఆర్ఎస్‌కు చెందినవారికి మాత్రమే ఇస్తున్నారని, నిజంగా నష్టపోయినవారికి ఇవ్వడంలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర్నాలు, ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటుండటంతో తాత్కాలికంగా వరదసాయం పంపిణీని నిలిపివేసి, సిబ్బందిలో అవసరమైన మార్పులు చేర్పులు చేసి మళ్ళీ పంపిణీ ప్రారంభించింది. నగరంలో కుత్బుల్లాపూర్‌లోని 4 డివిజన్లలో మొత్తం 100, రాజేంద్రనగర్ సర్కిల్లో 214, చింతల్ డివిజన్‌లో 55, గాజులరామారం సర్కిల్లో 25 కుటుంబాలకు రూ.10,000 చొప్పున వరదసాయం అందజేశారు. ఉప్పల్, రామాంతపూర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, హయాత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్ తదితర ప్రాంతాలలో వివిద కారణాల చేత వరదసాయం పంపిణీ చేయలేకపోయారు. దాంతో బాధితకుటుంబాలు తీవ్ర ఆసహనం, ఆగ్రహం వ్యక్తం చేసాయి. అధికారుల లాగిన్ సమస్యలు, తగినంత సొమ్ము, సిబ్బంది లేకపోవడం, స్థానికుల ఆగ్రహావేశాలు వంటి కారణాల చేత వరదసాయం పంపిణీలో ఆలస్యం అవుతోంది. అయితే కాస్త ఆలస్యమైనప్పటికీ అర్హులైన వారందరికీ తప్పకుండా వరదసాయం అందజేస్తామని అధికారులు ప్రజలకు నచ్చజెపుతున్నారు.