12.jpg)
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మానికం ఠాగూర్ అధ్యక్షతన నిన్న గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. దానిలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, సీనియర్ నేత వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.
త్వరలో జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఎన్నికలలో పోటీ చేయాలనుకొనే అభ్యర్ధుల నుంచి దరఖాస్తు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. జనరల్ సీట్లకు రూ.10,000, రిజర్వేషన్ సీట్ల రూ.5,000 ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ఫీజూ చెక్ రూపంలో పార్టీ బ్యాంక్ ఖాతాలో జమా చేయవలసి ఉంటుందని తెలిపారు.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మహిళలు, దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 7వ తేదీన ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈనెల 11న ఖమ్మంలో ట్రాక్టర్లతో రైతు ర్యాలీని, ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రైతు సమస్యలపై దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.