
ఈ నెల 13 తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకానుంది. ఈనెల 13న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని, ఆ తరువాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సీ.పార్ధసారధి చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పేర్లను ఖరారు చేసింది. వారందరికీ హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మంగళవారం ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నియమనిబందనల గురించి అవగాహన కల్పించేందుకు శిక్షణా శిభిరాన్ని ఎన్నికల కమీషనర్ సీ.పార్ధసారధి ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లు, 30 సర్కిళ్ళు ఉన్నాయి. ఒక్కో డివిజన్లో సుమారు 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రతీ డివిజన్‌కు ఒక్కో రిటర్నింగ్ అధికారిని నియమిస్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామాగ్రిని ఆయా కేంద్రాలకు చేర్పించడం వంటివన్నీ రిటర్నింగ్ అధికారి చూసుకోవలసి ఉంటుందని చెప్పారు. ఒక్కో సర్కిల్లో ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతను ఒక్కో డెప్యూటీ కమీషనర్‌కు అప్పగిస్తామని చెప్పారు.