జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఆన్‌లైన్‌ పోలింగ్?

త్వరలో జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ ఓటింగ్‌ను చేపట్టాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ సి.పార్ధసారధి చెప్పారు. అయితే వృద్ధులు, కరోనా సోకి క్వారెంటైన్‌లో ఉన్నవారు, ఎన్నికల విధులలో పాల్గొంటున్నవారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది అమలైతే దేశంలో ఇదే మొట్టమొదటి ఆన్‌లైన్‌లో ఓటింగ్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్‌లో దేశంలో జరుగబోయే అన్ని ఎన్నికలు ఆన్‌లైన్‌లో జరిగేందుకు దోహదపడవచ్చు కూడా. 

రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ సి.పార్ధసారధి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సమావేశం జరిగింది. దీనిలో ఐ‌టి శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఆ శాఖ ఉన్నతాధికారులు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ ప్రతినిధులు హాజరయ్యి ఆన్‌లైన్‌ ఓటింగ్ ప్రక్రియ, చట్టబద్దత, ఓటింగ్ గోప్యత, సాంకేతికపరమైన అంశాల గురించి లోతుగా చర్చించారు. 

కేంద్ర ఎన్నికల కమీషన్ ఆధ్వర్యంలో రూపొందించబడే మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా ఆ యాప్‌ను పరిశీలించి, ప్రయోగాత్మకంగా కొంతమంది చేత మాక్ ఓటింగ్ జరిపించి చూసి అంతా సవ్యంగా ఉందని భావిస్తే ఈ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. మన దేశంలో పోస్టల్ బ్యాలెట్స్ తప్ప ఇంతవరకు ఆన్‌లైన్‌ ఓటింగ్ విధానం అమలుచేయలేదు కనుక దీనిని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయవలసి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ సి.పార్ధసారధి తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే వరంగల్‌, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఆన్‌లైన్‌ ఓటింగ్ జరిస్తామని తెలిపారు. త్వరలోనే మళ్ళీ మరోసారి సమావేశమయ్యి దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకొన్నాక, ఆన్‌లైన్‌ ఓటింగ్ కోసం మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు.