
దేశంలో ఎన్నికల కమీషన్ ఎన్నికల ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తున్నప్పటికీ, రాజకీయ పార్టీలు, మీడియాలో కొన్ని వర్గాలు, కొన్ని వర్గాలుగా ఏర్పడిన సోషల్ మీడియా కలిసి ఎన్నికల స్థాయిని నానాటికీ దిగజార్చుతున్నాయి. అటువంటి ప్రయత్నమే దుబ్బాక ఉపఎన్నికలలో జరిగింది. పోలింగ్‌ను ప్రభావితం చేసే ఎటువంటి వార్తలు, విశ్లేషణలు, ప్రచురించరాదని ఎన్నికల కోడ్ స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ అందుకు భిన్నంగానే జరుగుతున్నాయని చెప్పక తప్పదు.
తాజాగా దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి విజయావకాశాలను దెబ్బ తీసేందుకు ఓ వ్యక్తి ‘ఆయన మళ్ళీ టిఆర్ఎస్లో చేరిపోబోతున్నారని, అందుకోసం ఇటీవల ఆయన మంత్రి హరీష్‌రావును కలిసారంటూ’ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆయన పట్ల ఓటర్లకు అపనమ్మకం కలిగేలా చేయాలనే దురుదేశ్యంతోనే సరిగ్గా పోలింగ్‌కు ఒకరోజు ముందు ఆ వీడియోను పెట్టాడని, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు డిజిపి మహేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తమ అభ్యర్ధి విజయావకాశాలను దెబ్బ తీసేందుకు జరిగిన ఈ కుట్రపై తక్షణం విచారణ జరిపించి ఆ వ్యక్తిని, అతని వెనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు. వారి ఫిర్యాదుపై డిజిపి మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆ వ్యక్తి లేదా వ్యక్తులను తప్పకుండా కనుగొని అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.