బిహార్‌ శాసనసభ ఎన్నికల రెండోదశ పోలింగ్ షురూ

మూడు దశలలో జరుగుతున్న బిహార్‌ శాసనసభ ఎన్నికలలో నేడు రెండోదశ పోలింగ్ ప్రారంభం అయ్యింది. పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటలవరకు జరుగుతుంది. బిహార్‌ శాసనసభలో మొత్తం 243 స్థానాలుండగా రెండో దశలో 17 జిల్లాలలోని 94 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. రెండో దశ ఎన్నికలలో మొత్తం 1,463 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇవాళ్ళ జరుగుతున్న పోలింగ్‌లో మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  

బిహార్‌లో సిఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార జేడీయు, బిజెపి కలిసి పోటీ చేస్తుండగా, మరోపక్క బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుల అధ్వర్యంలో ప్రధాన ప్రతిపక్షపార్టీ ఆర్‌.జే.డీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం  పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. 

బిహార్‌ శాసనసభ ఎన్నికలతోపాటు తెలంగాణలోని దుబ్బాక, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఝార్ఖండ్, నాగాలాండ్ రాష్ట్రాలలోని 54 శాసనసభ స్థానాలకు కూడా నేడు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వీటన్నిటి ఫలితాలు ఈ నెల 10వ తేదీన వెలువడతాయి.