
దుబ్బాక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు బందువుల ఇళ్ళలో పోలీసులు సోదాలు చేసి డబ్బు స్వాధీనం చేసుకోవడంపై టిఆర్ఎస్, బిజెపి నేతల మద్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. బిజెపి నేతల ఆరోపణలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ ఘాటుగా జవాబిచ్చారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్వర్యంలో దుబ్బాక ఉపఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్ధిపేట జిల్లా కలెక్టరును మా ప్రభుత్వం బదిలీ చేసింది. సిద్ధిపేటలో ఏమి జరిగిందో పోలీసులు ప్రకటించారు. దానికి సంబందించి వీడియోను కూడా విడుదల చేశారు. దానిలో చాలా స్పష్టంగా బిజెపి నేత బందువు ఇంట్లో ఆ డబ్బును స్వాధీనం చేసుకొన్నట్లు కనిపిస్తుంటే, బిజెపి నేతలు తిరిగి మా ప్రభుత్వంపై, సిఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తుండటం సిగ్గుచేటు. పోలీసులు మంత్రి హరీష్‌రావుతో పాటు టిఆర్ఎస్ నేతల ఇళ్ళలో కూడా సోదాలు చేశారు. పోలీసులు ఇంత నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తిస్తుంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. దుబ్బాక ఉపఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించినందునే బిజెపి నేతలు ఇటువంటి చవుకబారు ఎత్తులువేస్తున్నారు.
దుబ్బాకలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మంత్రి హరీష్‌రావు ఒక్కరే చూసుకొంటారని, మరెవరూ అక్కడకు వెళ్ళనవసరం లేదని సిఎం కేసీఆర్ ఆదేశించడంతో మేమేవరం అక్కడకు వెళ్ళడం లేదు. కానీ కాంగ్రెస్, బిజెపి నేతలు ఎక్కడెక్కడినుంచి నేతలను తీసుకువచ్చి ప్రచారం చేసుకొంటున్నారు. అయితే కాంగ్రెస్, బిజెపిలు ఎన్ని వేషాలు వేసినా, ఎంతగా ప్రచారం చేసుకొన్నా దుబ్బాక ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతనే భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. సిద్ధిపేటలో పోలీసుల సోదాలలో డబ్బు పట్టడంపై బిజెపి నేతలతో పాటు మీడియాలో ఓ వర్గం పనికట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తుండటం చాలా బాధాకరం. ఇకనైనా మీడియా సంయమనం పాటిస్తూ బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.