
దుబ్బాక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు బందువుల ఇళ్ళలో పోలీసుల సోదాలు, డబ్బు కట్టలు స్వాధీనం చేసుకోవడం, పోలీసులే ఆ డబ్బు కట్టలు పట్టుకువచ్చారని బిజెపి నేతల ఆరోపణలు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడం తదితర అంశాలపై బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలు, మీడియాలో వస్తున్న వార్తలు, విమర్శలపై సిద్ధిపేట పోలీస్ కమీషనర్ జోయల్ డేవీస్ స్పందించారు.
సిద్దిపేట పోలీస్స్టేషన్లో ఇవాళ్ళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “మాపై బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలు, అలాగే కొన్ని మీడియా ఛానల్స్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావు. మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారమే బిజెపి నేతల ఇళ్ళలో సోదాలు చేసి డబ్బు స్వాధీనం చేసుకొన్నాము. మాకు సురభి అంజన్ రావు (రఘునందన్ రావు మావగారు) ఇంట్లోనే ఆ డబ్బు దొరికింది. ఆ డబ్బును స్వాదీనం చేసుకొన్నాక ఆయన సంతకం కూడా తీసుకొన్నాము. కానీ ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా బిజెపి కార్యకర్తలు మాపై దాడి చేసి ఆ డబ్బును మా చేతుల్లోనుంచి బలవంతంగా గుంజుకుపోయి, తిరిగి మేమే ఆ డబ్బును పట్టుకువచ్చి, వారి ఇళ్ళలో పెట్టామని ఆరోపిస్తున్నారు. దీనిని మేము ఖండిస్తున్నాము. మా చేతుల్లో నుంచి డబ్బు గుంజుకోవడం, మాపై దాడి చేయడం రెండూ నేరాలే. ఈ ఘటనలో మొత్తం 20 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశాము.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల మేము దురుసుగా ప్రవర్తించలేదు. ఆయన దుబ్బాక రానని చెప్పి హటాత్తుగా దుబ్బాకకు రావడంతో పరిస్థితులు అదుపుతప్పుతాయని భావించి ఆయనను అదుపులోకి తీసుకొన్నాము తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. మేము ఏ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా పని చేయడం లేదు. ఎన్నికల కోడ్ను ఖచ్చితంగా పాటిస్తున్నాము,” అని అన్నారు.