
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎం కేసీఆర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడిస్తేనే సిఎం కేసీఆర్ ఎన్నికల హామీలను అమలుచేస్తారు. మళ్ళీ గెలిపిస్తే ఎప్పటిలాగే హామీలను అటకెక్కించేస్తారు. రాష్ట్రంలో వరుసగా జరుగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సిఎం కేసీఆర్ ప్రభుత్వోద్యోగులకు డీఏ పెంచి, బకాయిలను విడుదల చేస్తున్నారు. మొన్నటివరకు మొక్కజొన్న రైతుల గోడును పట్టించుకొని సిఎం కేసీఆర్ ఇప్పుడు రూ.1,850 చొప్పున మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొంటుందని ప్రకటించారు. ఇది దుబ్బాక ఉపఎన్నికల ప్రభావమే. ఇది దుబ్బాక ప్రజల నైతిక విజయమే. టిఆర్ఎస్‌ను ప్రజలు గెలిపిస్తుంటే సిఎం కేసీఆర్ పట్టించుకోరు. కనుక దుబ్బాకలో టిఆర్ఎస్‌ను ఓడగొట్టడం ఎంత ముఖ్యమో కాంగ్రెస్‌ను గెలిపించుకోవడం అంతే ముఖ్యం. అప్పుడే సిఎం కేసీఆర్ దిగివచ్చి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను వరుసగా అమలుచేయడం ప్రారంభిస్తాడు,” అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.