ఇల్లు కట్టించి పెళ్ళి చేసే ఏకైక సిఎం కేసీఆరే: కేటీఆర్‌

రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇవాళ్ళ జియాగూడా డిగ్నిటీ కాలనీలో 840 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పేదప్రజలకు ఇళ్ళు కట్టించి పెళ్ళి కూడా చేసే ఏకైక ముఖ్యమంత్రి  కేసీఆర్‌ మాత్రమే. రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు కట్టించి ఇస్తామంటే ప్రతిపక్షాలు ఎగతాళి చేశాయి. హైదరాబాద్‌ నగరంలో లక్ష ఇళ్ళు కట్టామని చెపితే నమ్మలేకపోతున్నారు. కట్టిన ఇళ్ళను చూసి ఓర్వలేక పారిపోయి, మళ్ళీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు ఏవిధంగా మాట్లాడుతున్నా మేము చిత్తశుద్ధితో ముందుకే సాగిపోతున్నాము. నగరంలో 2 లక్షల ఇళ్ళు కట్టేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాము. ఇదేవిధంగా దశలవారీగా అర్హులైన పేదప్రజలకు ఇళ్ళను అందిస్తుంటాము. ఒక్కో ఇల్లు నిర్మాణానికి సుమారు రూ.9 లక్షలు చొప్పున ఖర్చవుతోంది. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తున్నాము. వీటికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000 కోట్లు ఖర్చుచేస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మిస్తున్న కాలనీలను అన్ని హంగులతో నిర్మించి ఇస్తున్నాము. వాటిలో నివసించేవారు తమ ఇళ్ళనే కాకుండా తమ పరిసర ప్రాంతాలను, కాలనీలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఉంది,” అని అన్నారు.