హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయినవారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.550 కోట్లు మంజూరు చేసింది. నేటి నుంచే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించే కార్యక్రమం మొదలుపెట్టి వారంరోజులలోపు పూర్తి చేయాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నష్టపరిహారాన్ని ఒకేసారి మొత్తం చెల్లించాలని ఆదేశించారు. దీనికోసం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది.
బాధిత కుటుంబాలకు, వారి ఇళ్ళకు జరిగిన నష్టాన్ని అంచనావేసేందుకు ప్రాంతాలువారీగా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మరియు ఓ సంబందిత శాఖకు చెందిన అధికారులతో త్రిసభ్య కమిటీలను ఏర్పాటుచేసుకోవాలి. ముఖ్యంగా మురికివాడలలో నివసించే పేదప్రజలందరికీ ఈ నష్టపరిహారం అందేలా చూడాలి. వరదబాధిత కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రత్యేకంగా రూపొందించి మొబైల్ యాప్‌లో వారి వివరాలను, వారికి జరిగిన నష్టం వివరాలను, వారికి అందించిన నష్టపరిహారం వివరాలను రికార్డ్ చేయాలి. వాటిని వారి ఆధార్‌తో అనుసంధానించాలి. ఆర్ధికసాయం పొందిన ఇంటిపెద్దకు ముగ్గురు అధికారులు సంతకాలు చేసిన రసీదును అందజేయాలి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా విధిగా ఈ నష్టపరిహారం చెల్లింపు కార్యక్రమంలో పాల్గొని ఎక్కడా అవకతవకలు జరుగకుండా చూసుకోవాలి. ఈ నష్టపరిహారం చెల్లింపు కార్యక్రమాలను జీహెచ్ఎంసీ కమీషనర్ పర్యవేక్షించాలి.