హైదరాబాద్ ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వరదనీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు కొన్నిచోట్ల తమను పరామర్శించడానికి వచ్చిన ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న హయత్‌నగర్ పరిహిలోని రంగనాయకులగుట్ట కార్పొరేటర్ తిరుమలరెడ్డి ప్రజలను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ప్రజలు ఆయనను దుర్భాషలాడుతో కాలర్ పట్టుకొని కొట్టినంతపనిచేశారు. వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సహాయచర్యలు చేపట్టకుండా ఇప్పుడు తాపీగా పరామర్శలు చేయడానికి వచ్చావా? అంటూ ప్రజలు మండిపడ్డారు. స్థానికంగా ఉన్న ఓ చర్చి సమీపంలో నాలాపై ఆక్రమకట్టడాలు వెలుస్తున్నాయాని తాము ఎన్నిసార్లు పిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు వాటివలననే వరదనీరు బయటకు పోయే దారిలేక తమ ఇళ్ళలోకి ప్రవేశించిందని, అయినా కార్పోరేటర్, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి, నాలపై ఆక్రమణలు తొలగింపజేసి వరదనీరు బయటకు పోయేందుకు ఏర్పాట్లు చేస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చిన తరువాత ప్రజలు శాంతించారు.