ధరణి పోర్టల్‌ ప్రారంభం వాయిదా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ధరణి పోర్టల్‌ను సిఎం కేసీఆర్‌ దసరా పండుగ రోజున అంటే ఈనెల 25న ప్రారంభిస్తారని ముందు ప్రకటించినప్పటికీ, ఆ రోజున ముహూర్తబలం సరిపోలేదని కనుక దగ్గర్లోనే మరో మంచి ముహూర్తంనాడు ప్రారంభించవచ్చని తెలుస్తోంది. 

సాధారణంగా శ్రవణా నక్షత్రయుక్త దశమి రోజున దసరా పండుగను చేసుకొంటారు. కానీ 25వ తేదీన శ్రవణా నక్షత్రం ఉదయం 6.40 వరకు మాత్రమే ఉంటుంది. అప్పుడు ముహూర్తబలం సరిపోదనికనుక దసరా తరువాత మంచి ముహూర్తం చూసి ధరణి పోర్టల్‌ను ప్రారంభించడం మంచిదని పంచాగకర్తలు సూచించినట్లు తెలుస్తోంది. అధికారులు ఈవిషయం సిఎం కేసీఆర్‌కు తెలియజేశారు. ఇటువంటి విషయాలలో సిఎం కేసీఆర్‌కు నమ్మకాలు ఎక్కువ కనుక ధరణి పోర్టల్‌ ప్రారంభోత్సవంపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఇప్పటివరకు అతిముఖ్యమైన కార్యక్రమాలు, పధకాలను దసరా పండుగరోజునే ప్రారంభించి దిగ్విజయంగా నడుస్తున్నందున, ధరణి పోర్టల్‌ను 25వ తేదీ ఉదయం 6.40 గంటలలోపు ప్రారంభిస్తారా లేదా పంచగకర్తలు సూచించినట్లు మంచి ముహూర్తం కోసం ఆనవాయితీని పక్కను పెట్టి వేరే రోజున ప్రారంభిస్తారా? అనేది ఒకటి రెండు రోజులలో తెలిసే అవకాశం ఉంది.

ధరణి పోర్టల్‌లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్లు.. విజయవంతం...  

నిన్న రాష్ట్రంలో 570 మండలాలో ఒక్కో తహశీల్దార్ 10 చొప్పున భూములను ధరణి పోర్టల్‌ ద్వారా ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్స్ చేశారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా చాలా సజావుగా జరిగింది. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేయడం చాలా సులువుగా ఉందని తహసీల్దార్లు చెప్పినట్లు తెలుస్తోంది. మొదటిసారి కనుక ఒక్కో రిజిస్ట్రేషన్ కోసం సుమారు 30 నిమిషాలు సమయం పట్టిందని, కానీ అలవాటైతే 10-15 నిమిషాలకో రిజిస్ట్రేషన్ చేయగలమని తహసీల్దార్లు చెప్పినట్లు తెలుస్తోంది.

తెలుగులో ధరణి పోర్టల్‌ లింక్: https://dharani.telangana.gov.in/homePage?lang=te&csrf= 

ఇంగ్లీషులో ధరణి పోర్టల్‌ లింక్: https://dharani.telangana.gov.in/homePage?lang=en&csrf=