
ఇబ్రహీంపట్టణం టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇవాళ్ళ ఉదయం ఆయన మేడిపల్లి చెరువు వద్ద పూజలు చేసేందుకు రాగా గ్రామప్రజలు ఆయనను మా ఊర్లోకి రావద్దంటూ అడ్డుకొన్నారు. ఫార్మాసిటీతో ప్రభుత్వం తమ భూములను గుంజుకొంటుంటే పట్టించుకోకపోగా తమను బెదిరిస్తూ బలవంతం చేస్తున్నాడని మేడిపల్లి గ్రామప్రజలు ఆరోపించారు. తమకు అన్యాయం చేస్తున్న అటువంటి వ్యక్తిని తమ గ్రామంలో అడుగుపెట్టనీయమని వాదిస్తూ గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకొన్నారు.
పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు చాలా ప్రయత్నించారు. ఈ సందర్భంగా చాలాసేపు పోలీసులకు, గ్రామస్తులకు మద్య తోపులాటలు జరిగాయి. దాంతో గ్రాంస్తులు మరింత రెచ్చిపోయి ఎమ్మెల్యే కారుపై రాళ్ళు, చెప్పులు విసిరి నిరసనలు తెలియజేశారు. “మంచిరెడ్డి కిషన్ రెడ్డి డౌన్ డౌన్... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి,” అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారాయి. దాంతో పోలీసులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నచ్చజెప్పి పోలీస్ బందోబస్తు మద్య వెనక్కు తిప్పి పంపేశారు. ఆందోళనలో పాల్గొన్న గ్రామస్తులను, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డితో సహా పలువుని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాంతో గ్రామస్తులు పోలీసులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.