
దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్‌కు కాంగ్రెస్, బిజెపి నేతల మద్య మాటల యుద్ధాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వాదనలపై మంత్రి హరీష్‌రావు ఘాటుగా స్పందించారు.
“రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లకు కేంద్రప్రభుత్వం కేవలం 1.8శాతం నిధులు మాత్రమే ఇస్తోంది. మిగిలినదంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇవికాక కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పలు సంక్షేమ పధకాలను అమలుచేస్తోంది. వాటిలో ఏ ఒక్కదానికీ కేంద్రప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదు. అయినా ప్రజాసంక్షేమం దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని మోస్తోంది. ఇటువంటి పధకాల కోసం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా కనీసం బిజెపి పాలిత రాష్ట్రాలలోనైనా ఇవ్వగలుగుతున్నారా అంటే లేదు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని బిజెపి నేతలు అబద్దాలు చెపుతూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుంటే కేంద్రప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని ఒత్తిడి చేస్తోంది. బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలుచేయలేని అనేక సంక్షేమ పధకాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేస్తున్నప్పుడు బిజెపి నేతలు ఏ మొహం పెట్టుకొని దుబ్బాక ప్రజలను ఓట్లు అడుగుతున్నారు?” అని హరీష్‌రావు ప్రశ్నించారు.
మంత్రి హరీష్‌రావు చేసిన ఆరోపణలపై మళ్ళీ బండి సంజయ్ కూడా ఘాటుగా స్పందించారు. “తెలంగాణ రాష్ట్రంలో ఏఏ అభివృద్ధి పనులకు, ఏఏ సంక్షేమపధకాలకు కేంద్రప్రభుత్వం ఎన్నెన్ని నిధులు ఇస్తోందో నేను గణాంకాలతో సహా నిరూపించడానికి సిద్దం. మంత్రి హరీష్‌రావు, సిఎం కేసీఆర్ కాదని నిరూపించగలరా? నిరూపిస్తే దుబ్బాక నడిబొడ్డున నేను ఉరివేసుకొంటాను. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని వాదిస్తున్న మంత్రి హరీష్‌రావు తెలంగాణ ప్రభుత్వం దుబ్బాకకు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పగలరా? కేంద్రప్రభుత్వం తెలంగాణకు సహకరించడంలేదని వాదిస్తున్న ఆయన కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పధకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలుచేయడంలేదో చెప్పగలరా? ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలున్నవారు ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలుకల్పిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టసవరణ ఎవరి కోసమో అందరికీ తెలుసు. టిఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ చట్టసవరణ చేసింది తప్ప ప్రజల కోసమో...రాష్ట్రం కోసమో కాదు,” అని బండి సంజయ్ ఘాటుగా బదులిచ్చారు.