మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జయంతి నేడు

ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి నేడు. అణు విజ్ఞాన,అంతరిక్షరంగాలలో  భారత్‌ను అగ్రదేశాల పక్కన నిలిపిన గొప్ప శాస్త్రవేత్తలలో అబ్దుల్ కలాం కూడా ఒకరు. 

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో 1931, అక్టోబర్ 15న జన్మించారు. బాల్యం నుంచే మేధావిగా గుర్తింపు తెచ్చుకొన్న ఆయన ఫిజిక్స్, ఏరోస్పేస్‌లో ఇంజనీరింగ్ చేశారు. నాలుగు దశాబ్ధాలపాటు డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవెలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పనిచేసి అనేక నూతన ఆవిష్కరణలు చేశారు. బాలిస్టిక్ మిసైల్స్, వాటి లాంచ్ వెహికల్స్ తయారీలో కీలకపాత్ర పోషించారు. అందుకే ఆయనకు ‘మిసైల్ మ్యాన్’ అనే పేరు వచ్చింది. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో అంటే 1998లో రాజస్థాన్‌లోని పోక్రాన్ వద్ద అణుపరీక్షలు నిర్వహించడంలో కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కీలకపాత్ర పోషించారు. 

దేశవిదేశాలలోని అనేక యూనివర్సిటీలు ఆయనను అవార్డులతో సన్మానించాయి. కేంద్రప్రభుత్వం కూడా 1981లో పద్మభూషన్, 1990లో పద్మవిభూషన్, 1997లో ప్రతిష్టాకమైన భారతరత్న అవార్డులతో ఆయనను గౌరవించింది. ఆయన అందుకొన్న అవార్డుల గురించి పూర్తిగా వ్రాయాలంటే ఓ పెద్ద పుస్తకమే వ్రాయవలసి ఉంటుంది. ఆయన అనేక అద్భుతమైన పుస్తకాలు కూడా వ్రాశారు. వాటిలో వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నేటడ్ మైండ్స్, మిషన్ ఇండియా, టార్గెట్ 3 బిలియన్ వంటివి ఆయనకు గొప్ప రచయితగా కూడా గుర్తింపు తెచ్చాయి.       

ఆయన దేశభక్తి, ప్రతిభాపాటవాలకు మరింత అత్యున్నతమైన గౌరవం కల్పించాలని భావించిన ఆనాడు(2002లో) అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆయన పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఆ ప్రతిపాదనను సమర్ధించడంతో ఆయన రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

రాష్ట్రపతి పదవి చేపట్టిన తరువాత కూడా శాస్త్రసాంకేతిక రంగాలలో కేంద్రప్రభుత్వానికి మార్గదర్శనం చేశారు. ఆయన శత్రుభీకరమైన క్షిపణులు, అణ్వపరీక్షలలో కీలకపాత్ర పోషించినప్పటికీ ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది యువతలో, ముఖ్యంగా విద్యార్దులలో స్పూర్తిని నింపే ప్రసంగాలు చేయడమే. 2015, జూలై 27వ తేదీన ఆయన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ షిల్లాంగ్‌ విద్యార్దులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తుండగా హటాత్తుగా వేదికపైనే కుప్పకూలిపోయారు. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన విద్యార్దుల సమక్షంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన జన్మస్థలమైన రామేశ్వరంలోని పైకరుంబులో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సకల అధికారిక లాంఛనాలతో  అంత్యక్రియలు నిర్వహించాయి. అనంతరం ఆయన స్మృత్యర్ధం రామేశ్వరంలో పైకరుంబులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్ కేంద్రాన్ని డీఆర్‌డీవో నిర్మించింది. జూలై 2017లో ప్రధాని నరేంద్రమోడీ దానిని ప్రారంభించారు. తుదిశ్వాస విడిచేవరకు కూడా దేశాభివృద్ధి, పర్యావరణం, అంతరిక్ష పరిశోధనలు, ప్రజాసంక్షేమం, విద్యార్దుల గురించే ఆలోచిస్తూ ఎంతో కృషిచేసిన ఆ మహానుభావుడుకి యావత్ దేశ ప్రజల తరపున మైతెలంగాణ.కామ్ నివాళులు ఆర్పిస్తోంది.