గెలుస్తామనుకొంటే ఫిరాయింపులు ఎందుకు? ఉత్తమ్‌కుమార్ రెడ్డి

దుబ్బాక ఉపఎన్నికలను టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు రెండూ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో రెండు పార్టీల నేతలు గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ చాలా భారీ మెజార్టీతో గెలుస్తుందని మంత్రి హరీష్‌రావు నమ్మకంగా చెపుతున్నారు. అయితే భారీ మెజార్టీతో టిఆర్ఎస్‌ గెలుస్తుందని ఆయనకు అంతగా నమ్మకం ఉంటే మళ్ళీ కాంగ్రెస్‌ నేతలను, కార్యకర్తలను టిఆర్ఎస్‌లోకి ఎందుకు ఫిరాయింపజేసుకొంటున్నారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఎప్పుడు ఏ ఎన్నికలోచ్చినా టిఆర్ఎస్‌ తీవ్ర అభద్రతాభావానికి గురవుతుంటుంది. ముఖ్యంగా మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులు ఓటమి భయంతో ఉంటారు. అందుకే ఎన్నికలొస్తే ముందుగా కాంగ్రెస్‌ పార్టీ నేతలను, కార్యకర్తలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటారు. ఇది వారి అభద్రతాభావానికి నిదర్శనం,” అని ఆక్షేపించారు.  

“ప్రజలు మీ ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారని భావిస్తున్నట్లయితే ఓటర్లను ఎందుకు ప్రలోభపెడుతున్నారు? ఓటర్లకు డబ్బు వెదజల్లకుండా, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపజేసుకోకుండా ఒక్క ఎన్నికలైనా న్యాయంగా ఎదుర్కొని గెలవగలరా?దమ్ముంటే దుబ్బాక ఉపఎన్నికలలో న్యాయబద్దంగా పోటీ చేసి గెలవాలని మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులకు నేను సవాలు విసురుతున్నాను. దుబ్బాక ఉపఎన్నికలలో మంత్రి హరీష్‌రావు తన మొహం చూసి టిఆర్ఎస్‌ అభ్యర్ధి సోలిపేట సుజాతకు ఓట్లేయాలని కోరడం చూస్తే, ప్రజలు సిఎం కేసీఆర్‌ మొహం చూసి ఓట్లేసే రోజులు పోయాయని గ్రహించారా?” అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు.   

దుబ్బాక ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడం ద్వారా సిఎం కేసీఆర్‌ పాలనను వ్యతిరేకిస్తున్నామని ప్రజలు స్పష్టమైన సందేశం పంపించబోతున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.