సిపిఐ సీనియర్ నేత గుండా మల్లేశ్ మృతి

సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నీమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవల కరోనా కూడా సోకడంతో నీమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 

నిరుపేద కార్మిక కుటుంబంలో జన్మించిన గుండా మల్లేశ్ ఆదిలాబాద్ జిల్లాలోని తాండూరు మండలంలోని రెచినీ గ్రామంలో మెట్రిక్యులేషన్ వరకు చదువుకొన్నారు. ఆ తరువాత బెల్లంపల్లిలో ఓ లారీ ట్రాన్స్‌పోర్టు సంస్థలో మొదట లారీ క్లీనరుగా తరువాత డ్రైవరుగా ఉద్యోగం చేశారు. అప్పుడే ఆయన జీవితం మలుపు తిరిగింది. లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై యజమాన్యంతో పోరాడి కార్మిక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. 

ఆ తరువాత సింగరేణిలో బొగ్గుగని కార్మికుడిగా ఉద్యోగం చేశారు. కానీ అక్కడా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటుండటంతో సిపిఐలో జేరి వారి కోసం అనేక పోరాటాలు చేశారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి సిపిఐ పార్టీకి... కార్మికుల సమస్యలకే పూర్తిగా అంకితమైపోయారు. 

తొలిసారిగా 1983 శాసనసభ ఎన్నికలలో ఆసిఫాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత మళ్ళీ 1985, 1994లో వరుసగా గెలిచారు. మళ్ళీ 2009లో బెల్లంపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎప్పుడూ హంగులు, ఆర్భాటలకు తావీయకుండా చాలా నిరాడంబర జీవితం గడిపేవారు. ప్రజలకు, కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల కోసం పోరాడే ప్రియనేస్తంగా గుండా మల్లేశ్ వారి మనసుల్లో నిలిచిపోయారు. అన్ని పార్టీలలో నేతలతోనూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ అజాతశత్రువుగా గుర్తింపు పొందారు. ఆయన మృతిపట్ల సిపిఐ, సిపిఎంలతో సహా వివిద పార్టీలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.