
దుబ్బాక ఉపఎన్నికలలో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావుకు మళ్ళీ కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. రాధారమణి అనే ఓ మహిళ దుబ్బాకలో ఇంటింటికీ తిరుగుతూ మహిళలను కలిసి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
కొన్నేళ్ళ క్రితం భర్త నుంచి విడిపోయిన ఆమె న్యాయసహాయం కోసం వృత్తిరీత్యా న్యాయవాది అయిన రఘునందన్ రావును కలిశారు. అప్పుడు ఆయన తనకు టీలో మత్తుమందు కలిపి ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని, ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆమె దుబ్బాకలో ఇంటింటికీ తిరుగుతూ మహిళలను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ ఈ ఎన్నికలలో రఘునందన్ రావుకు ఓటు వేయవద్దని అభ్యర్ధిస్తున్నారు.
ఇప్పటికే టిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఆయనకు ఇప్పుడు ఈమె చేస్తున్న వ్యతిరేక ప్రచారంతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల బరిలో తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే తన ప్రత్యర్ధులు ఇటువంటి నీచమైన పనులకు దిగజారుతున్నారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మహిళ తనపై చేసిన ఆరోపణలను గతంలోనే ఖండించానని మళ్ళీ ఇప్పుడూ మరోసారి ఖండిస్తున్నానని అన్నారు. ఇటువంటి కుట్రలు, కుతంత్రాలకు భయపడి తాను వెనక్కు తగ్గబోనని, ఈ ఉపఎన్నికలలో దుబ్బాక ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా ఘన విజయం సాధిస్తానని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు.