
స్థానిక సంస్థలలో కోటాలో నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ్ళ ఉదయం స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం అయ్యింది. పటిష్టమైన బందోబస్తు మద్య ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. దీని కోసం ఆరు టేబిల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా వారిలో 823 మంది ఓట్లు వేశారు. మొదటి రౌండ్లో 600 ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ్ళ ఉదయం 10.30 లోపుగానే మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. దాంతోనే విజేత ఎవరో తేలిపోతుంది. రెండో రౌండ్లో మిగిలిన 223 ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికలలో గెలిచేందుకు మ్యాజిక్ ఫిగర్ 413 ఓట్లుకాగా టిఆర్ఎస్కు సుమారు 700 వరకు ఉన్నందున ఆ పార్టీ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత నామినేషన్ వేసిన రోజునే గెలుపు ఖరారు అయిపోయింది. కాంగ్రెస్, బిజెపి అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేయడం వలననే ఎన్నికలు జరుపవలసి వచ్చింది. లేకుంటే నామినేషన్లు వేసిన రోజునే కవితను ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ప్రకటించి ఉండేవారు.
కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం వెంటనే దృవీకరణ పత్రం ఇస్తుంది కనుక తొలిసారిగా బుదవారం శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు. ఆ రోజు జరుగబోయే మండలి సమావేశానికి హాజరయ్యి ప్రమాణస్వీకారం చేయనున్నారు.