వైద్యఆరోగ్యశాఖలో ఇకపై ఏటా ఖాళీలు భర్తీ: కేటీఆర్‌

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమయ్యింది.  ఆ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖకు సంబందించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఆ వివరాలను మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌ మీడియాకు వివరించారు. 

• వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 12,000 పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం. 

• ఇకపై ఏటా ఒకసారి లేదా రెండుసార్లు వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీ చేసుకొనేందుకు అనుమతించాం. 

• ఆరోగ్యశ్రీ పధకంలోకి కిడ్నీ, లివర్, హార్ట్ శస్త్రచికిత్సలను కూడా చేర్చుతున్నాం. 

• తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారుచేసి డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తాం. 

• రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకుగాను కొత్తగా 8 డయాగ్నస్టిక్స్ హబ్స్ ను ఏర్పాటుచేసి, ఇప్పుడున్న తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రాలను వాటితో అనుసంధానం చేస్తాం. వీటిలో ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. 

• ప్రస్తుతం 198 బస్తీ దవాఖానాలున్నాయి. కొత్తగా మరో 100 దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నాం. 

• 218 అంబులెన్సులు కొనుగోలు చేస్తున్నాము. సిఎస్ఆర్ పధకం కింద మరో 20 అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయి. వాటితో కలిపి ఇప్పుడున్న వాటికి అదనంగా 238 అంబులెన్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ మండలానికి ఇప్పుడు అంబులెన్స్ సౌకర్యం ఉంది. 

• ఇప్పుడు ఉన్న 8 పాలియేటివ్ కేర్ సెంటర్లకు అదనంగా మరో 2 కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. 

• త్వరలోనే ప్రభుత్వ మెడికల్ షాపులు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తాం.