
కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి మరియు లోక్ జనశక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ (74) గురువారం అర్ధరాత్రి ఢిల్లీలో కనుమూశారు. ఆయన ఇటీవల గుండెకు శస్త్ర చికిత్స చేయించుకొన్నారు. దాని కోసం గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలోనే ఉన్నారు. గురువారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఈవిషయం ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లందించారు.
బిహార్ నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన అతికొద్దిమంది రాజకీయ నేతలలో రాంవిలాస్ పాశ్వాన్ ఒకరు. ఆయన ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుయిడిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 1969లోనే సంయుక్త సోషలిస్ట్ పార్టీలో చేరి రాజకీయాలలోకి ప్రవేశించారు. 1974లో లోక్‌దళ్, 2000 సం.లో లోక్ జనశక్తి పార్టీలను స్థాపించారు. దళితుల హక్కులు, రక్షణ కోసం అలుపెరుగని పోరాటాలు చేసి గొప్ప దళితనాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన దివంగత ప్రధానులు వీపీ సింగ్, ఐకె గుజ్రాల్, వాజ్ పేయిల ప్రభుత్వాలలో కేంద్రమంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధాని దేవగౌడ, ప్రధాని నరేంద్రమోడీల ప్రభుత్వాలలోనూ కేంద్రమంత్రిగా మానిచేశారు. రైల్వే, కమ్యూనికేషన్లు, కార్మిక సంక్షేమం, బొగ్గు, ఉక్కు, ఎరువులు, రసాయనాలు, ఆహారం, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖలకు మంత్రిగా పనిచేశారు.
ఆయన ఆకస్మిక మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, ఇంకా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.