హైదరాబాద్‌కు మరో పర్యాటక ఆకర్షణ?

ఇప్పటికే దేశంలో ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో ఒకటిగా నిలుస్తున్న హైదరాబాద్‌ నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణగా హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనో మెట్రో రైల్‌లో వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుదవారం హెచ్‌ఎండీఏ అధికారులతో సమావేశమయ్యి ఈ అంశం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు దేశవిదేశాలలో ఏర్పాటు చేయబడిన మోనో రైల్‌ ప్రాజెక్టులకు సంబందించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించేందుకు కన్సల్టెంట్ సంస్థకు బాధ్యత అప్పగించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. దీంతోపాటు దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిడ్‌మానేరు, కొండపోచ్చమ్మ, సోమశిల తదితర ప్రాంతాలను పర్యాటక ఆకర్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. 

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశవిదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించగలిగితే తెలంగాణ పేరు ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అవడమే కాక పర్యాటకుల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం కూడా సమకూరుతుంది. తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే కాక రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయగలిగితే అదొక గొప్ప పర్యాటక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.