
దుబ్బాక ఉపఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ, “సోలిపేట రామలింగారెడ్డి, కుటుంబ సభ్యులు కూడా తెలంగాణ కోసం ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆ తరువాత పార్టీ కోసం, తన నియోజకవర్గం అభివృద్ధి కోసం చాలా అంకితభావంతో పనిచేశారు. ఆ కారణంగా దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు వారి కుటుంబంతో మంచి అనుబందం ఉంది. ఆ నియోజకవర్గంలో సోలిపేట రామలింగారెడ్డి మొదలుపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేసేందుకు వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించడం భావ్యంగా ఉంటుంది. జిల్లాలో టిఆర్ఎస్ నాయకులందరినీ సంప్రదించి వారి అంగీకారంతోనే సోలిపేట సుజాత పేరును ఖరారు చేశాను. కనుక ఆమెను భారీ మెజార్టీతో గెలిపించుకొనేందుకు పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
దుబ్బాక నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా తూమకుంట నర్సారెడ్డి పేరును ఖరారు చేశారు. కానీ ఒకవేళ టిఆర్ఎస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయనకు టికెట్ కేటాయించే ఆలోచన కూడా ఉంది. టిఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు అయిపోయారు కనుక టికెట్ ఆశించి భంగపడిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తారో చూడాలి. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తారా లేదా అనే విషయం ఇవాళ్ళ తేలిపోతే పార్టీ అభ్యర్ధి పేరును పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే అధికారికంగా ప్రకటిస్తారు.
బిజెపి అభ్యర్ధిగా రఘునందన్ రావు పోటీ చేయబోతున్నట్లు తాజా సమాచారం. అయితే బిజెపి అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. బహుశః నేడు ప్రకటించవచ్చు.
దుబ్బాక ఉపఎన్నికల షెడ్యూల్:
నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9
నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17
ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19
పోలింగ్ తేదీ : నవంబర్ 3
కౌంటింగ్ తేదీ నవంబర్: 10