
జనవరిలో జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలు సిద్దం అయిపోయాయి. తమ ప్రభుత్వం రూ.60,000 కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిందని, ఆ అభివృద్ధే తమను జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిపిస్తుందని టిఆర్ఎస్ భావిస్తోంది. నగరంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించి ఓట్లు కోరాలని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు.
అయితే అందుకు పూర్తిభిన్నమైన వాదనతో కాంగ్రెస్, బిజెపిలు ప్రజలలోకి వెళ్ళబోతున్నాయి. హైదరాబాద్ నగరంలో కొన్ని ఫ్లై ఓవర్లను నిర్మించడం తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బిజెపి ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు అన్నారు. నగరంలో కొత్తగా ఎన్ని రోడ్లు, కాలువలు నిర్మించిందో దాని కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో చెప్పాలన్నారు. చిన్నపాటి వర్షాలకు కూడా నగరంలో పలు ప్రాంతాలలో నాలాలు పొంగిపొర్లుతుంటాయని, నగరంలో ప్రధాన రహదారులే చెరువులను తలపిస్తుంటాయని అన్నారు. ఇక నగరంలో నేటికీ పలుప్రాంతాలలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీస మౌలికవసతుల కల్పించకుండా నగరం అభివృద్ధికి రూ.60,000 కోట్లు ఖర్చు చేశామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పడాన్ని ఎన్.రామచందర్ రావు తప్పుపట్టారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు గడుస్తున్నా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ హామీని అమలుచేయలేదని ఆక్షేపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తూ ఎన్నికలకు ముందు ఈవిధంగా హడావుడి చేస్తుంటుందని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ ఓటమి భయంతోనే జనవరిలో జరుగవలసిన జీహెచ్ఎంసీ ఎన్నికలను నవంబర్‌లో జరిపించేందుకు తెరవెనుక పావులు కదుపుతోందని మంత్రి కేటీఆర్ మాటలతో స్పష్టమైందన్నారు. కానీ ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించి హైదరాబాద్ నగరాన్ని టిఆర్ఎస్- మజ్లీస్‌ల నుంచి విముక్తి కల్పిస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకొంటోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ హామీల అమలులో వైఫల్యం, ఇటీవల వర్షాలకు గుంతలు పడిన రోడ్లు, పొంగిపొర్లి ప్రాణాలు హరిస్తున్న నాలాలు, కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం వంటి స్థానిక అంశాలను ఆయుధాలుగా వినియోగించుకోబోతోంది.
అయితే ఈ మూడు పార్టీల వాదనలలో గ్రేటర్ ప్రజలు వేటిని నమ్ముతారు? వేటిని తిరస్కరిస్తారు? అని ప్రశ్నించుకొంటే అభివృద్ధికే ఓట్లు వేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని కాదని వేరే పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే, జీహెచ్ఎంసీ-రాష్ట్ర ప్రభుత్వం మద్య రాజకీయాలు మొదలైతే అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుంది. కనుక బహుశః టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపవచ్చు.