టిఆర్ఎస్‌ని చూసి భయపడక్కరలేదు: జితేందర్ రెడ్డి

గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్‌ను వీడి బిజెపిలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సోమవారం దుబ్బాకలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ను చూసి మీరెవరూ భయపడనవసరం లేదు. ఎందుకంటే కేంద్రంలో మనమే అధికారంలో ఉన్నాము. టిఆర్ఎస్‌ మన జోలికి వచ్చే సాహసం చేస్తుందనుకోను. కనుక కార్యకర్తలు టిఆర్ఎస్‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ దుబ్బాక ఉపఎన్నికలలో మన పార్టీని గెలిపించుకోవాలి. మంత్రి హరీష్‌రావు రైతులను రెచ్చగొట్టేందుకు మన పార్టీకి ఓటేసి గెలిపిస్తే బోరుబావులకు మీటర్లు బిగిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓటమి భయంతోనే టిఆర్ఎస్‌ నేతలు మనపై ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారు. కానీ అది వాస్తవం కాదని మన పార్టీని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి గజ్వేల్, సిద్ధిపేట కంటే బాగా అభివృద్ధి చేస్తామని ఓటర్లకు నచ్చజెప్పాలి. దుబ్బాక ఉపఎన్నికలలో  టిఆర్ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని చెప్పుకొంటున్నప్పుడు ఆ పార్టీ నేతలు అప్పుడే ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు, మద్యం ఎందుకు పంచిపెడుతున్నారు?ఓడిపోతామేమోననే భయంతోనే కదా?మనమందరం కలిసికట్టుగా పనిచేసి మన పార్టీని గెలిపించుకొని మరోసారి టిఆర్ఎస్‌కు మన సత్తా చాటాలి,” అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో దుబ్బాక బిజెపి అభ్యర్ధిగా భావిస్తున్న బిజెపి రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు, మాజీ ఎంపీ చాడా సురేశ్ రెడ్డితో సహా పలువురు బిజెపి సీనియర్ పాల్గొన్నారు.