జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కేటీఆర్‌ శంఖారావం

వచ్చే ఏడాది జనవరిలోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగవలసి ఉంది. కానీ ఇంకా ముందుగానే జరుగవచ్చని, నవంబర్‌ మొదటి వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కనుక ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్దం కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు స్పష్టం చేశారు. 

ఇవాళ్ళ నగరంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గత 5 ఏళ్లుగా హైదరాబాద్‌ నగరం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.67,000 కోట్లు ఖర్చు చేసింది. దానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే మీకు అందజేస్తాను. మన ప్రభుత్వం హైదరాబాద్‌ నగరాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసిందో ప్రజలకు వివరించి టిఆర్ఎస్‌కు ఓట్లు వేయాలని ప్రజలను కోరుదాము. ధరణి పోర్టల్‌ ద్వారా సామాన్యప్రజలకు వారి ఇళ్ళు, స్థలాలపై పూర్తి యాజమాన్యపు హక్కులు కల్పించబోతున్నాము. ఆస్తుల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాస్వితంగా పరిష్కరించడానికే ధరణి పోర్టల్‌ తీసుకువస్తున్నాము. కనుక ధరణి పోర్టల్‌ వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ చొరవ తీసుకోవాలి. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా సిద్దంగా ఉంది. నగరంలో 15 మంది కార్పొరేటర్ల పనితీరు సంతృప్తికరంగా లేదు. తక్షణం వారు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి లేకుంటే చర్యలు తీసుకోవలసి వస్తుంది. వారికి ఏవైనా సమస్యలున్నట్లయితే వారి ఎమ్మెల్యేను కలిసి మాట్లాడి పరిష్కరించుకోవచ్చు,” అని చెప్పారు.